header

Akbar…అక్బర్

Akbar…అక్బర్
అక్బర్ భారతదేశాన్ని పాలించిన మూడవ చక్రవర్తి. ఇతను మొగల్ రాజ్య స్థాపకుడైన బాబర్ మనుమడు, హుమయూన్ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్నతనంలోనే 1556 సం.లో తన 13వ ఏట సింహాసనం అధిష్టిస్తాడు. అప్పటికి రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉండేది. తన మంత్రి బైరాం ఘాన్ సహాయంతో అల్లర్లను అణచివేశాడు. అక్బర్ యువకుడై పూర్తిగా రాజ్యాధికారం చేపట్టేదాకా బైరాంఖాన్ దే పెత్తనమంతా.
అక్బర్ రెండవ పానిపట్ యుద్ధంలో హేమూని జయించాడు. 1576 సం.లో హల్దీఘాట్ వద్ద రాణా ప్రతాపసింహుణ్ణి జయిస్తాడు. 1586 లో కాశ్మీర్ ను, 1592 సం.లో ఒరిస్సాను జయించి కాశ్మీరు నుండి దక్షిణాపథం వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు.
అక్బర్ హిందూమతం పట్ల ద్వేషభావం ప్రదర్శించకుండా హిందూ, ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంచటానికి కృషిచేసాడు. రాజపుత్ర స్త్రీ అయిన జోధాబాయిను వివాహమాడాడు. జోథాబాయి తమ్ముడైన మాన్ సింగ్ ను తన సేనాధిపతిగా నియమించుకున్నాడు. ప్రఖ్యాతి గాంచిన హిందూ గాయకుడు తాన్ సేన్ ను తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. పరిపాలన దక్షుడైన తోడర్ మల్ కూడా అక్బర్ ఆస్ధానంలోని వాడే.
హిందువుల మీద వేసిన పన్నులను రద్దు చేసాడు. అన్నిమతాలు ఒకటే అని తాను స్వయంగా ‘దీన్-ఇలా-హీ’ అనే నూతన మతాన్ని స్థాపించాడు. కానీ ఈ మతం ప్రాచుర్యంలోనికి రాలేదు.
1571 సం.లో ఆగ్రా సమీపంలో ఫతేపూర్ సిక్కీ అనే పట్టణం నిర్మించి తన రాజధానిని అక్కడకు మార్చాడు. కానీ నీటి ఎద్దడి రావటం వలన తిరిగి ఢిల్లీకి తన రాజధాని మార్చాడు.
మొగలాయి రాజులందరిలో కెల్లా మతసహనం కలవాడిగా పేరుపొందాడు. 49 సంవత్సరాల పాటు అక్బర్ చక్రవర్తి రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించి, చివరిదశలో తన కుమారుడైన జహంగీర్ కు రాజ్యం అప్పగించి 1605 సం.లో మరణించాడు.